క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు సెలబ్రిటీ అయిన ప్రస్థానం

ఒకరు టెక్కీ రెవల్యూషన్‌కి మొదటి దిక్సూచి. మరొకరు ఆ టెక్నాలజీని సామాన్యుడి అరచేతిలోకి చేర్చిన దార్శనికుడు. ఒకరు వ్యాపారవేత్త, మరొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి సారధి.

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, భారత ప్రధాని మోదీ. వీళ్లిద్దరి మధ్య చాయ్‌ పే చర్చ జరిగితే ఎలా ఉంటుంది.. ఏయే అంశాలు ప్రస్తావనకొస్తాయి..? ఏయే ఎక్స్‌ట్రీమ్స్‌ని టచ్ చేస్తారు..? అసలు ఈసారి చాయ్‌పే చర్చతో మోదీ ఏం సాధించాలనుకున్నారు? క్రియేటివిటీని విచ్చలవిడిగా వాడెయ్యడంలో మోదీ తర్వాతే ఎవరైనా. 2014 నుంచి ఈ విషయాన్ని రుజువు చేస్తూ వస్తోంది మోదీ బెటాలియన్. పదేళ్ల కిందట మోదీ ఎలక్షన్ క్యాంపైన్‌ని సూపర్‌యాక్టివ్‌ మోడ్‌లోకి తీసుకెళ్లిన కాన్సెప్ట్ పేరు.. చాయ్‌ పే చర్చ.

శాటిలైట్ టెక్నాలజీ సాయంతో ఒకేసారి వెయ్యి టీస్టాల్స్‌ని అనుసంధానం చేసి.. టీనీళ్లు చప్పరిస్తూ ఏకకాలంలో ఓటర్లతో ముచ్చట్లు పెట్టారు మోదీ. రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన్న మోదీ.. ఇవాళ ప్రైమ్‌మినిస్టర్ స్టాయికి చేరాడన్న మాటను జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అదే చాయ్ పే చర్చ.. 2024లో మళ్లీ షురూ ఐంది. కాకపోతే.. ఇది పక్కా అడ్వాన్స్‌డ్ వెర్షన్. అప్పట్లో చాయ్‌ పే చర్చతో ఆమ్‌ ఆద్మీల మనసుల్ని కొల్లగొట్టి ఎన్నికల్లో సక్సెస్ సాధించారు. ఇప్పుడు యువ ఓటర్లను, ప్రత్యేకించి టెక్నలాజికల్ ప్రొఫెషనల్స్‌ని టార్గెట్ చేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత, టెక్ దిగ్గజం బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ జరిపిన చాయ్‌ పే చర్చ.. నెక్స్ట్ లెవల్.

అమ్మ ఆవు నుంచి.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దాకా.. డిజిటల్‌ పేమెంట్స్‌ నుంచి తృణధాన్యాల దాకా.. పబ్లిక్‌ ఇన్‌ఫ్రా నుంచి పర్యావరణ పరిరక్షణ దాకా.. అన్ని అంచుల్ని తాకుతూ అత్యంత ఆసక్తికరంగా సాగింది ఇద్దరి మధ్య చర్చాగోష్టి. టెక్నాలజీ వాడకంలో ఇండియన్స్ ఆర్‌ ది బెస్ట్ అని బిల్‌గేట్స్ ప్రశంసిస్తే.. దానికి కోరస్ పలికారు మోదీ. ఇండియాలో జరిగిన G-20 సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడకాన్ని గుర్తు చేశారు. వీఐపీ అతిథుల్ని రిసీవ్ చేసుకోవడంలో ఏఐ యాప్స్ ఎలా ఉపయోగించామో చెప్పుకొచ్చారు మోదీ. తన హిందీ ప్రసంగాల్ని కృత్రిమ మేథ సాయంతో ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసిన విషయాన్ని కూడా బిల్‌ గేట్స్‌కి వివరించారు మోదీ. కానీ.. వికృతరూపం దాలుస్తున్న డీప్ ఫేక్‌ ఇష్యూ కూడా వీళ్లిద్దరి మధ్య చర్చకొచ్చింది. ఇదే సందర్భంలో నమో యాప్‌ ఎలా వినియోగించాలో గేట్స్‌కు వివరించారు.. అదే యాప్‌లో ఇద్దరూ సెల్ఫీ దిగారు.

అటు.. డిజిటల్‌ రంగంలో భారత్‌ తీసుకొచ్చిన మార్పులను ప్రధాని మోదీ సమక్షంలో ప్రశంసించారు బిల్‌గేట్స్‌. ఇండియాలో మైక్రోసాఫ్ట్‌ సేవలు ప్రారంభమై పాతికేళ్లయిందని, మంచి ఫలితాలొచ్చాయని గుర్తు చేసుకున్నారు. డేటా చౌర్యంపై ఇద్దరూ తమతమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ప్రైవసీని దెబ్బతీయకుండా డేటా వినియోగం జరగాలని, రీసెర్చ్‌ డేటా వాడుకునే సమయంలో డేటా యజమాని దగ్గర గోప్యత పాటించకూడదని చెప్పారు మోదీ. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించిన అత్యంత ఎత్తయిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం గురించి బిల్‌గేట్స్‌కు వివరించారు. ఆరులక్షల గ్రామాల నుంచి ఉక్కును, మట్టిని తెప్పించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ ప్రతిష్టాత్మక విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. భావితరం ఇంజనీర్లకు ఇదొక కేస్ స్టడీ అని చెప్పి బిల్‌గేట్స్‌తో వావ్ అనిపించుకున్నారు.

ఐ లవ్ టెక్నాలజీ.. ఎక్కడ ఏ మోడ్రన్ గాడ్జెట్ కనిపించినా.. అది ఎలా పనిచేస్తుంది.. దాన్ని ఎలా వాడాలి.. అని చర్చిస్తా.. అనుసరిస్తా.. అని చెప్పారు ప్రధాని మోదీ. ఆ వెంటనే ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ హెల్త్ కాన్షియస్‌ వైపు ఫోకస్ పెట్టారు. ఎరువులతో అవసరం లేకుండా, చాలా తక్కువ నీటి ఆసరాతో పండించగలిగే తృణధాన్యాలు కూడా మోదీ-గేట్స్ మధ్య చర్చకొచ్చాయి. తృణధాన్యాలు చాలా శక్తి మంతమైన ఆహారమన్న నిజాన్ని నవతరం కూడా అంగీకరిస్తోంది. అందుకే.. ఈ మధ్య స్టార్ హోటల్స్ మెనూలో సైతం సిరిధాన్యాలు మెరుస్తున్నాయన్నారు మోదీ. భారతీయ కళాఖండాలు, నీలగిరి చాయ్‌, కాశ్మీర్ కుంకుమపువ్వు.. ఇలా ఇండియన్ సూపర్‌స్పెషాలిటీస్‌ అన్నిటి గురించి విపులంగా వివరించి, వాటిని స్వయంగా బహూకరించి మిస్టర్ గేట్స్‌ని ఫిదా చేశారు మోదీ. మొత్తానికి మోదీ వారి సమర్పణలో మొదలైన ‘చాయ్‌ పే చర్చ’ నయా వెర్షన్.. వరల్డ్ వైడ్ వైరల్ న్యూస్‌గా మారిందిప్పుడు. ఎన్నికల వేళ కొత్త అవతార్‌లో కనిపించి.. ఆవిధంగా టెక్కీ ఓట్లకు గట్టిగానే గాలమేశారు విశ్వగురు మోదీ.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!